Friday, August 21, 2026
HomeEntertainmentసెలవు తీసుకున్న ఏడున్నర దశాబ్దాల నటనా ప్రస్థానం

సెలవు తీసుకున్న ఏడున్నర దశాబ్దాల నటనా ప్రస్థానం

1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి, ‘షావుకారు’ చిత్రంతో 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీ రామారావు కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆమెకు ‘షావుకారు జానకి’గా శాశ్వతమైన గుర్తింపును ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి ఏడు దశాబ్దాలకు పైగా సాగిన అరుదైన కెరీర్‌ను సొంతం చేసుకున్నారు.
హీరోయిన్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో రూపం దాల్చింది. అయితే పాత్ర ఏదైనా, తెరపై ఆమె కనిపిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన బలం వచ్చేది. భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన నటన, కుటుంబ కథల్లో మధ్యతరగతి మహిళగా ఒదిగిపోయే తీరు, హాస్యభరిత పాత్రల్లోనూ మెప్పించే సామర్థ్యం ఆమె ప్రత్యేకత.
తమిళ దర్శక దిగ్గజం కే. బాలచందర్ దర్శకత్వంలో ఆమె చేసిన పాత్రలు షావుకారు జానకి నటనా వైవిధ్యానికి మరో ఉదాహరణ. అప్పటివరకు ఆమెకు ఏర్పడిన ‘విషాదభరిత పాత్రల నటి’ అనే ఇమేజ్‌ను దాటి, ఆమెలోని పూర్తి నటిని ఆవిష్కరించిన దర్శకుడిగా బాలచందర్ నిలిచారు.
తెలుగులోనూ ‘రోజులు మారాయి’, ‘బాటసారి’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్‌గా మాత్రమే కాకుండా… తల్లి, అత్త, భార్య, మధ్యతరగతి మహిళ వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేశారు.
దశాబ్దాల నటనా సేవకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వ కలైమామణి, తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారం, నంది అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారాలతో పాటు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 91వ ఏట పద్మశ్రీ రావడం తనకు ఎంతో గర్వకారణమని అప్పట్లో ఆమె పేర్కొన్నారు.
‘షావుకారు’గా మొదలై… ఒక శకంగా ముగిసిన ప్రయాణం
ఆమె కెరీర్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఒకే తరానికి చెందిన నటిగా మిగిలిపోలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో హీరోయిన్‌గా మెరిసి… తర్వాతి తరాల హీరోలతో తల్లి, బామ్మ, ఇతర కీలక పాత్రలు పోషించి… కొత్త తరంతోనూ తెరను పంచుకున్నారు.
అందుకే షావుకారు జానకి పేరు ఒక నటి పేరుకంటే ఎక్కువ. అది తెలుగు, తమిళ సినీ చరిత్రలో ఒక పరివర్తనకు ప్రతీక. 94 ఏళ్ల వయసులో, ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణానికి ఆమె నిన్న ముగింపు పలికారు. వయసు పెరిగినా కళాకారిణిగా ఆమెకు వచ్చిన గౌరవం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. షావుకారుగా అడుగుపెట్టి…
సౌజన్యానికి, సహజ నటనకు చిరునామాగా నిలిచి…
దాదాపు నాలుగు వందల పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు
షావుకారు జానకి!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments